ఐపీఎల్‌ను క్యాష్‌ చేసుకునేందుకు బార్లలో ప్రత్యేక ఏర్పాట్లు...

2 days ago 5

కస్టమర్లు లేరు.. వచ్చినా ఇద్దరు ముగ్గురే ! అయినా బిల్లు వెయ్యి దాటడం లేదు. ఒకప్పుడు రోజుకు లక్షల రూపాయల్లో అయ్యే కౌంటర్‌.. ఇప్పుడు వేలు దాటడం లేదు. దీంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి బార్లు.

వేళాపాళా లేకుండా... నిత్యం రద్దీగా ఉండే బార్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. లాక్‌డౌన్‌తో ఆరు నెలలుగా మూతపడ్డ బార్లు, క్లబ్బులు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయి. బార్లు తెరిచి నెలలు గడుస్తున్నా... కస్టమర్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదరుచూడాల్సిన పరిస్థితి.

కరోనా తెచ్చిన కరెన్సీ కష్టాలు అన్నీఇన్నీ కావు. పనుల్లేక కొందరు.. పైసల్లేక కొందరు... ఉద్యోగాలు ఊడి కొందరు.. జీతాలు తగ్గి మరికొందరు అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతటి మద్యంబాబులైనా.. బార్‌ కెళ్లి తాగే సాహసం చేయడం లేదు. నిత్యం వందల రూపాయలు తాగుడుకు ఖర్చు చేసే వాళ్లు సైతం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతీ రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు. దీంతో బార్ల నిర్వాహకులకు కష్టాలు తప్పడం లేదు. ఆరు నెలలుగా బార్లు మూతపడే ఉన్నప్పటికీ.. అద్దెలు మాత్రం ఎప్పటిలాగే కట్టుకోవాల్సిన పరిస్థితి. గిరాకీ లేక అప్పుల్లో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బార్‌ నిర్వాహకులు.

మద్యం షాపుల వద్ద అమ్మకాలు డల్ అయ్యాయి. ఇలాంటి తరుణంలో బార్లకు వచ్చి కూర్చుని తిని తాగి వెళ్లే కస్టమర్లను ఎక్స్‌పెక్ట్ చేయలేం అంటున్నారు బార్ నిర్వాహకులు. ఫుల్ తాగే వాళ్లు హాఫ్‌తో.. హాఫ్ తాగే వాళ్లు క్వార్టర్‌తో సరిపెట్టుకుంటున్నారు. వైన్స్ ధరల కంటే... ఎక్కువ పెట్టి బార్‌కి వచ్చి తాగే సాహసం చేసేవాళ్లు తక్కువే. బార్‌లో మద్యంతో పాటు ఫుడ్‌ కూడా తీసుకోవాల్సిందే. ఇది అదనపు ఖర్చు.

లాక్ డౌన్ నష్టాలు పూడ్చుకోవాలంటే.. మద్యంపై ఎలాగో ధరలు పెంచలేరుకాబట్టి.. ఫుడ్‌పై పెంచారు. పెంచిన ధరలు చూసి కస్టమర్లు అటునుంచి అటే వెళ్లిపోతున్నారని అంటున్నారు బార్‌ నిర్వాహకులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బార్‌కెళ్లి కోరి కరోనా తెచ్చుకోవడం ఎందుకని రాకుండా ఉండే జనాలు సైతం ఉన్నారు.‌

క్రికెట్‌ పండగ వచ్చేసింది. రేపటి నుంచి ఐపీఎల్‌ సీజన్‌-14 ప్రారంభం కాబోతోంది. ఇలాంటి తరుణంలో ఐపీఎల్‌ను ఎలాగైనా క్యాస్‌ చేసుకోవాలని చూస్తున్నాయి బార్లు, పబ్బులు. క్రికెట్‌ ఫ్యాన్స్‌ కోసం మ్యాచ్‌లు వీక్షించేందుకు బార్‌లో ప్రొజెక్టర్లు, స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనికితోడు... ఫుడ్‌, స్నాక్స్‌పై ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఐపీఎల్‌..! ఈపేరులోనే కిక్కుంది. ఐపీఎల్‌ అటే ఆ హంగామానే వేరు. కానీ.. ఐపీఎల్‌పై కరోనా కాటుపడింది. అతిథుల్లేని పెళ్లిలా..  ఫ్యాన్స్‌ లేకుండానే ఐపీఎల్‌ జరగనుంది. ఇది క్రికెట్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌ ఐనప్పటికీ.. బార్లు, పబ్బులకు గుడ్‌ న్యూస్‌లా మారింది. ఐపీఎల్‌ సీజన్‌తో ఎలాగైనా సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాయి బార్లు.

Read Entire Article