కోవిడ్ విజృంభణ: మధ్యప్రదేశ్‌లో లాక్‌డౌన్.. సీఎం కీలక వ్యాఖ్యలు

2 days ago 3

| Samayam Telugu | Updated: 08 Apr 2021, 02:04:00 PM

ప్రస్తుతం ప్రపంచంలోనే రోజువారీ కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉంది. అమెరికా తర్వాత ఒక్క రోజు పాజిటివ్ కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి.

మధ్యప్రదేశ్ లాక్‌డౌన్

ప్రధానాంశాలు:

  • క్రమంగా ఆంక్షల చట్రంలోకి జారుకుంటున్న భారత్.
  • మధ్యప్రదేశ్‌లో మహారాష్ట్ర తరహా కోవిడ్ ఆంక్షలు.
  • త్వరలో మరిన్ని కఠిన ఆంక్షలకు సిద్ధమైన శివ్‌రాజ్.
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదువుతుండటంతో పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌లు అమలుచేస్తున్నాయి. తాజాగా, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూడా వారాంతపు లాక్‌డౌన్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ తెలిపారు. భోపాల్, ఇండోర్ నగరాల్లో రాత్రి కర్ఫ్యూలు ఇప్పటికే అమలవుతున్నాయి.

కొన్ని నగరాల్లో కేసులు పెరుగుతున్నాయని, ఆ ప్రాంతాల్లో ఆంక్షలపై సంక్షోభ నిర్వహణ బృందంతో సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. పెద్ద నగరాల్లో కంటెయిన్‌మెంట్‌ జోన్లను పెంచుతున్నట్లు చెప్పారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి నిబంధనలను పాటించి కోవిడ్ బారినపడకుండా ఉండాలని శివరాజ్ సూచించారు. కేవలం ఆదివారమే ఒక్క రోజే లాక్‌డౌన్ ఉంటుందని బుధవారం సాయంత్రం సీఎం ప్రకటించినా.. తాజాగా దానిని సవరించారు.

మధ్యప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న 11 రాష్ట్రాల్లో ఇదీ కూడా ఒకటి. గడచిన 24 గంటల్లో 4,000కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మధ్యప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 3.18లక్షలు దాటింది. ప్రధాన నగరాలైన ఇండోర్‌, భోపాల్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో అధికశాతం ఈ రెండు నగరాల్లోనే నమోదవుతున్నాయి. బుధవారం ఇండోర్‌లో 866 కేసులు, భోపాల్‌లో 618 కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఈ నేపథ్యంలో శివరాజ్‌ సింగ్‌ ప్రభుత్వం వారాంతపు లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4వేల మందికి పైగా కరోనాకు బలయ్యారు. మరో 2.88లక్షల మంది వైరస్ బారినపడ్డారు. తదుపరి ఆదేశాలు వెలువరించే వరకూ ప్రయివేట్, ప్రభుత్వా ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలను కూడా నిలిపివేయాలని ఇండోర్ జిల్లా అధికార యంత్రాంగం ఆదేశించింది.

కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ క్రమంగా ఆంక్షల చట్రంలోకి జారుకుంటోంది. ఇప్పటికే వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న మహరాష్ట్రలో వారాంతపు లాక్‌డౌన్‌, రాత్రికర్ఫ్యూ విధించగా.. గుజరాత్‌, ఢిల్లీ, పంజాబ్, చత్తీస్‌గఢ్ కూడా కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు అమలుచేస్తున్నాయి. దేశంలో వైరస్ మొదలైన 14 నెలల తర్వాత తొలిసారిగా వరుసగా మూడో రోజు పాజిటివ్ కేసులు లక్ష దాటడం గమనార్హం.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : lockdown in madhya pradesh urban areas from 6 pm tomorrow to 6 am monday
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article