టీకా రెండో డోస్ తీసుకున్న మోదీ.. అర్హత ఉంటే వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపు

2 days ago 4

| Samayam Telugu | Updated: 08 Apr 2021, 08:54:00 AM

Vaccination in India దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి కొనసాగుతోంది. మొదటి దశ కంటే మరింత వేగంగా మహమ్మారి విస్తరించడంతో ప్రజలకు వీలైనంతే తొందరగా టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

ప్రధానాంశాలు:

  • కోవిడ్ టీకా రెండో డోస్ తీసుకున్న ప్రధాని.
  • కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒకటే మార్గమని వ్యాఖ్య.
  • ఎయిమ్స్‌లో కొవాగ్జిన్ వేసిన సిస్టర్ నివేదా.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కోవిడ్-19 టీకా రెండో డోస్ వేయించుకున్నారు. మార్చి 1న ప్రధాని తొలి డోస్ తీసుకున్న విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం మొదటి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ వ్యవధిని 6-8 వారాలకు కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా రెండో డోస్‌ తీసుకున్నారు. తొలి డోస్ వేయించుకున్నప్పటిలా కాకుండా ఈసారి ప్రధాని ఫేస్ మాస్క్ ధరించి వ్యాక్సిన్ తీసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... అర్హత ఉంటే ప్రాణాంతక కోవిడ్-19 మహమ్మారి బారి నుంచి రక్షణ పొందేందుకు వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రధాని మరోసారి పిలుపునిచ్చారు. ‘‘కరోనా వైరస్‌ను ఓడించడానికి టీకా మన వద్ద ఉన్న మార్గాల్లో ఒకటని, అందుకే అర్హులైతే మీరు కోవిడ్-19 టీకా తీసుకోండి’ అని మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లింక్‌ను కొవిడ్ వెబ్‌సైట్, టీకా నమోదు కోసం అందుబాటులోకి తెచ్చిన పోర్టల్‌లో పంచుకున్నారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాను ప్రధాని మోదీ తీసుకున్నారు.

ప్రధానికి ఇద్దరు నర్సులు టీకా వేయగా.. వీరిలో ఒకరు తొలి డోస్ ఇచ్చిన నర్సు నివేదా. నివేదా మోదీ చేతిని పట్టుకోగా, మరో నర్సు నిషా శర్మ వ్యాక్సిన్ వేశారు. ఇదిలా ఉండగా, దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని క్రమంగా వేగవంతం చేస్తున్నారు. తొలుత వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, తర్వాత 60 ఏళ్లు దాటినవారు, 45 ఏళ్లు దాటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నవారికి వ్యాక్సినేషన్ అందజేశారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన అందరికీ టీకా పంపిణీ ప్రారంభించారు. ఇప్పటి వరకూ దేశంలో 8 కోట్ల మందికి టీకాను అందజేశారు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : pm modi gets covid vaccine second dose and says if eligible, get your shot soon
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article